Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page

శ్రీకాంచీయతి
శ్రీహరి సాంబశివశాస్త్రి

శ్రీ కాంచీయతులు, జగద్గురువులు, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు స్ఫూర్తికి వచ్చినపుడు బహుముఖములుగ కాంతిపుంజం విరజిమ్మే బ్రహ్మతేజోమయ మూర్తి యొకటి భక్తుల హృదయాలలో గోచరమౌతుంది. శాంతపావనమగు అచింత్యవైభవము ఆముఖదీప్తిలో ప్రస్ఫుటమౌతుంది. ''స్మితపూర్వభాషీ రాఘవః''- అన్న సూక్తిని స్ఫురణకు దెచ్చే మందస్మిత వదనం ఆ మూర్తికి అమూల్యమైన సహజాలంకారం.

- : యత్ర రామస్త త్రాయోధ్యా : -

శ్రీ చరణులు నిలినచోటు శ్రీనిలయం. అది యొక దివ్యతీర్ధం. పవిత్రయాత్రాస్థలం. అచట ప్రశాంత రమణీయ వాతావరణం నెలకొంటుంది. అచట జేరెడి భక్తునకు- శాంత మీద మాశ్రమపదం- అన్న భావన కలుగక మానదు.

వాడవాడలనుండి యెందఱందఱో ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధార్థులు, తత్త్వవేత్తలు శ్రీచరణుల దర్శనభాగ్య మపేక్షించి నిత్యం వస్తూఉంటారు. భారతము పంచమవేదము. అది ధర్మశాస్త్రజ్ఞులకు ధర్మశాస్త్రంగాను, ఐతిహాసికుల కితిహాసంగాను, నీతివిచక్షుణులకు నీతిశాస్త్రంగాను, కవిపుంగవులకు మహాకావ్యంగాను, అధ్యాత్మవిదులకు వేదాంతశాస్త్రం గాను- ఈరీతిగా వారి వారి ప్రతిభా యోగ్యతాచిత్త సంస్కారాలనను సరించి వేదంవలె సాక్షాత్కరిస్తుంది. శ్రీ చరణులు గూడ చమత్కృతి ప్రధానసంభాషణచతురుడుగా, చారిత్రక పరిశోధకుడుగా, వివిధభాషాతత్త్వవిదుడుగా, న్యాయవేత్తగా, రాజకీయ విశారదుడుగా, విమర్శకుడుగా, సాహితీవేత్తగా, మహోపాసకుడుగా, మంత్రశాస్త్రమర్మజ్ఞుడుగా, యోగీశ్వరుడుగా, ధర్మదేవతగా, అధ్యాత్మవిదుడుగా, దేశికుడుగా, ఆప్తబంధువుగా, వాచంయమిగా- ఈ రీతిగా వివిధరూపాలతో గోచరిస్తూ ఉంటారు. ఆశ్రితుల ననుగ్రహిస్తూ ఉంటాడు. విసుగు విరామం లేకుండా నిరంతరం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అసంగభావం వారిలో గోచరిస్తూ ఉంటుంది. 'అసక్థః సుఖమన్వభూత్‌'- అను కాళిదాససూక్తిని స్ఫురింప జేస్తూ ఉంటారు.

తొలిసారిగా శ్రీచరణులకు మా 'భారతీనిరుక్తి' గ్రంథాన్ని వినిపించుటకై విజయవాడనుండి ఏలూరు వెళ్ళాము. అది ధనుర్మాసం. మధ్యాహ్నసమయం. తెల్లవారుజాముననే లేచి పూజాకార్యక్రమం పూర్తిచేసి పరిచారమంతా ప్రగాఢ నిద్రలో మునిగియున్నది. పీఠంలో అలజడి యేమాత్రంలేదు. మారాక శ్రీవారికి తెలియజేయుట యెట్లో? కింకర్తవ్యమ్‌? ఎవరైనా రాకపోదురా? అని యట్లే నిరీక్షిస్తున్నాం. సుమారు పదినిముషములు గడచినవోలేవో- ఇంతలో మంద హాసం చేసుకుంటూ పెద్ద బాదమాకు చేతితో పట్టుకొని శ్రీవారు లోపలినుండి వచ్చారు. ఆకు నేలపై వేసి కూర్చొని మమ్ములనుకూడ కూర్చొనుటకు సైగచేశారు. మరుమాట లేదు మీ గ్రంథాన్ని చదవండి- అన్నారు. మేము గ్రంథాన్ని వినిపించుటకు రాగలమని ముందుగా శ్రీవారితో చెప్పలేదు. మారాకకు కారణం శ్రీవారి కెట్లు తెలిసింది? మావార్త నందించుట కచట నెవరునులేరే! మాయాశ్చర్యాని కంతులేదు. అనుగ్రహంతో శ్రీవారే మా గ్రంథాన్ని వినుటకు వచ్చుట మాభాగ్యం. మా గ్రంథంలో కొంత భాగం వినిపించాం. మధ్యలో శ్రీవారు రామాయణప్రసక్తి తెచ్చారు. విజయవాడలో రామాయణ ప్రసక్తి తెచ్చారు. విజయవాడలో రామాయణ నామౌచిత్యం, కా డవిభాగతత్త్వం, సుందరకాండసౌందర్యంమున్నగు వాటిని గూర్చి చెప్పారుగదా? ఆ విషయాలు గ్రంథస్థం చేశారా? చేయకపోతే చేసి వినిపించండి. అయితే మూడు నియమాలు పాటించాలి. 1. గ్రంథరచన మీఅహంకారాన్ని పెంపొందించకూడదు. 2. పరనింద ఉండరాదు. 3. గ్రంథరచనతో ధనార్జన సేయరాదు.

ఈ నియమాలు పాటిస్తూ గ్రంథ రచనజేసి వేదమాతృ సేవ చేయండి- అని యాదేశించారు. అవకాశ మున్నపుడల్లా మీ గ్రంథాన్ని వినిపిస్తూ ఉండండి. అని చెప్పి నవ్వుతూలేచారు.

మా భారతీనిరుక్తి గ్రంథాన్ని వినిపించుటకై కంచి వెళ్ళాము. సావకాశంగా పదునైదు రోజులు మా గ్రంథం విన్నారు. ఒకరోజున మా గ్రంథం చదువుచుండగా ఒక వృద్ధుడైన ఋగ్వేద ఘనపాఠి వచ్చాడు. నెమ్మదిగా శ్రీవారిని సన్య్నాసస్వీకరణ కనుమతి నిమ్మని యర్థించాడు. అంతట శ్రీవారు- ఋగ్వేదంలో ఏదేని యొక ఋక్కునకు వరుసగా పదక్రమఘనదండాది వికృతులను చెప్పుమని కోరారు. ఒక మంత్రానికి ఆయన అన్నీ వరుసగా చక్కగా చెప్పారు. అపుడే కామాక్షి కోవెలనుండి ప్రసాదంగా వచ్చియున్న పెద్ద పూల దండను శ్రీవారు ఆ ఘనపాఠి మెడలో వేయించారు- 'మీరు దండం (సన్న్యాసం) అడిగారు. నేను దండ ఇచ్చాను'- అన్నారు శ్రీవారు నవ్వుతూ.

శ్రీవారి యనుగ్రహానికి ఈ చమత్కారానికి ఆ ఘనపాటి చకితుడై ఆనందాశ్రువులు రాలుస్తూ మరుమాటలాడక సెలవు తీసికొన్నాడు.

దండధారణ (సన్న్యాసం) సులభసాధ్యంకాదు; అది అసిధారావ్రతం; అసంగభావం మీలోలేదు. మీరు దండలకే అర్హులు; దండానికి కాదు- అనే విషయాన్ని నిపుణంగా, మనస్సు నొచ్చకుండా ఘనపాఠికే కాక యట నున్న పండితుల కందఱకు ఉపదేశించినట్లయింది.

'మహాత్మనా మింగితై శ్చేష్టితైర్బహవో అపూర్వా విషయావ్యజ్యన్తే'

ఒకనాడు స్వాహా ప్రకరణం చదువుతున్నాము. ఈ శబ్దం హోమవాచక సాంకేతిక శబ్దంగా పరిగణింపబడుతుంది. కాని యిది పరదేవతకు, వేదమునకు గూడ వాచకము. వేదమే తనకు స్వాహా, స్వధా వివరించుకొన్నది. అంటూ స్వాహా దేవీ స్వరూపవర్ణన పరమైన షడ్వింశ బ్రాహ్మణభాగాన్ని చదువుతున్నాం. శ్రీవారు ఆనందిస్తూ ఎంతో ఉల్లాసంగా వింటున్నారు. ఆ సమయంలో భక్తులెవరో సమర్పించిన సమత్సయైన కపిలధేనువును పరిచారకులు శ్రీవారి కడకు కొని తెచ్చారు. వెంటనే అప్రయత్నంగా-

'ఏషాస్వాహాదేవీ గోరూపిణి సమాగతా | స్వాహాకృపతో

భవదీయా భారతీనిరుక్తిః శశ్వత్‌ విజయతేతరామ్‌'

అనే మాటలు శ్రీ చరణుల ముఖంనుండి వెల్వడినవి.

అప్రయత్నలబ్ధమైన శ్రీవారి యాశీస్సు మమ్ము ముగ్ధుల గావించింది. ఎనలేని ఉత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. సావధానంగా పరిశీలిస్తే- మేమేకాదు- ఎందఱందరో శ్రీవారికడకు వస్తూ ఉంటారు. వారి వారి యనుభవాలను వింటూ ఉంటే' 'అందఱికంటే తమనే శ్రీవారెక్కువగా ప్రేమిస్తారు; అనుగ్రహిస్తారు. అనేతృప్తి వారి యందఱిలో ప్రస్ఫుటమౌతూవచ్చింది. అందఱ కన్ని విధాల తృప్తిని కలిగించటం మహాత్ముల లక్షణం. అట్టి మహాత్ములే శ్రీచరణులు. రమతే ఇతిరామః రమయతీతిరామః అ శబ్దార్థ ప్రతిరూపమే శ్రీ కాంచీయతి.

శ్రీ శంకరాచార్య పద మాస్థితి మిద్ధదీప్తిం

శ్రీ కామకోటి పద దేశిక మాప్త బంధుమ్‌ |

శ్రీ చంద్రశేఖర ముదారగుణం వరేణ్యం

కాంచీయతీంద్ర గురురాజ మహం ప్రపద్యే ||

శ్రీ చంద్రశేఖర పదాబ్జవిలీనభృంగం

శ్రీ దేవతాపదసరో రుహ సౌరభాఢ్యమ్‌ |

శ్రీ వేదవాజ్మయ సముద్ధరణౖకదీక్షం

కాంచీయతీంద్ర మనిశం మనసాస్మరామి||

ధర్మోత్తరే పథిచరన్త మనల్ప సత్త్వం

భక్తాంశ్చ ధర్మమహితే పథి చారయన్తమ్‌ |

బోధామృత ప్రశమితాఖిల తాపబృందం

కాంచీయతీంద్ర మిహనౌమి జగద్గురుం తమ్‌ ||


Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page